Thursday 10 May 2018

మహానటి !

మహానటి !

ఇది సినిమా రివ్యూ కాదు.. మహానటి సినిమా మీద నా భావాలు మాత్రమే !!

మహానటి సావిత్రి మొన్నటి , నిన్నటి తరాల్ని తన అందం తో, అభినయం తో మంత్ర ముగ్ధుల్ని చేస్తే.. ఈ తరం వాళ్లకు ఆమె లేని లోటు ని ఆమె బయోపిక్ "మహానటి" తీరుస్తాది. అందుకు గాను ముందు గా ఈ చిత్ర నిర్మాణానికి పూనుకున్న దర్శక నిర్మాతలకు అభినందనలు..!



సావిత్రి తండ్రి లేని చిన్న పిల్ల..
తండ్రి ప్రేమ తెలియని చిన్న పిల్ల..
తండ్రి రూపు గుర్తు లేని చిన్న పిల్ల..

స్వయానా పెదనాన్న నాన్న అని పిలువమంటే మురిసిపోయి "మా నాన్న మా నాన్న" అని చెప్పుకున్న ప్రేమ అనే లోటు ఉన్న కన్నె పిల్ల..

నాన్నకు మీసాలు ఉంటాయా అంటూ అమ్మని అడిగే సావిత్రి పాత్రని ఆరేళ్ల పాప గా పరిచయం చేసినప్పటి నుండి - ఒక గాలి కబురు విని తండ్రి ఫోటో కోసం వెతుక్కుంటూ వెళ్ళే స్టార్ గా చూపించడం లో దర్శకుడు "సావిత్రి ప్రేమ కు ఇచ్చే విలువ " చెప్పకనే చెప్పాడు !!

జెమినీ గణేశన్ ! ఒక మాటకారి.. నాకు పెళ్లయింది.. ఒక అక్రమ సంబంధం ఉంది.. కానీ నేను ప్రేమించింది మాత్రం నిన్నేఅని నిజం చెప్పి ఒప్పించగలిగే అంత మాటకారి..!

అన్నీ తెలిసి కూడా "నా మీద ప్రేమ" తనని మారుస్తాది అని నమ్మిన పదహారేళ్ల అమ్మాయి - అన్నీ తెలిసి చేసుకున్న తర్వాత ఇంక మారడం ఎందుకు అనుకున్న బాధ్యత తెలియని భర్త ల సంఘర్షణ లో మనం కోల్పోయింది ఒక "మహానటి" ని !!



నేర్పించక పోతే పొండి కానీ నాకు రాదు అనడానికి మీరు ఎవరు అని సొంతం గా నాట్యం నేర్చుకున్న పట్టుదల సావిత్రి సొంతం !

ఆ పట్టుదలే ఆమెను ఉన్నత శిఖరాలకు చేర్చింది..!

తను కొబ్బరి లౌజు లు కొనడం మానేసి ముసలి తాత భోజనానికి సాయం చేసిన చిన్నారి సావిత్రి అంత పెద్ద స్టార్ ఐన తర్వాత చేయకుండా ఉంటాదా? ఉండదు.. పోనీ సర్వం కోల్పోయాక ఉంటాదా? అప్పుడు కూడా ఉండదు.. అవసరం అయితే చీర అమ్మి మరీ సాయం చేస్తాది. అది సావిత్రి అంటే.. !!

పదహారేళ్ల వయసులో ఎవ్వరితో చర్చించకుండా తనకు తాను గా సావిత్రి తీసుకున్న (ఆ అవకాశమే ఇవ్వనట్టు ఉన్నాడు జెమినీ "ఉన్నదీ ఒకటే జన్మయితే" అనే ఒక్క డైలాగ్ తో జెమినీ గణేశన్ సావిత్రి ని ఎమోషనల్ గా కంట్రోల్ చేశాడా అన్నంతగా చాలా బాగా చూపించారు ఈ సినిమాలో ) నిర్ణయం తో కుటుంబానికి దూరమైన సావిత్రి.. తన భర్త గురించి తెలుసుకుని దూరమయ్యి ఒంటరిగా మిగిలింది..



భర్త కు ఐతే దూరం అయ్యింది కానీ భర్త నేర్పిన అలవాటు కి కాదు.. ! అదే ఆమె కు శాపం గా మారింది. సూరిటీ లు, సినిమా డైరెక్షన్ లు , తెలిసిన వాళ్ళ చేతిలో మొసపోవడాలు.. కారణాలు ఏమైనా అన్నీ మహానటి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని క్షీణింప చేసాయి !

 "చివరకు మిగిలేది" చేసిన మంచి తప్ప ఏమి లేదని చెప్పకనే చెప్పింది !

 ఇన్ని పార్శ్వాలు ఉన్న పాత్రని కీర్తి సురేష్ అద్భుతం గా పోషించింది ! కాదు జీవించింది ! కాదు కాదు ఆ సావిత్రమ్మే కీర్తి గా తిరిగొచ్చింది అనుకునేంత బాగా చేసింది !!
నాగేశ్వర రావు ని చూడటానికి గేట్ కీపర్ కి కితకితలు పెట్టిన అల్లరి పిల్ల లో నాగేశ్వర రావు వచ్చాడా అని నాగేశ్వర రావు నే అడిగిన అమాయకపు పిల్ల !

గా అలరించిన కీర్తి..! కార్ రేస్ లో పాల్గొన్న సావిత్రి ఆత్మభిమానాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించింది !



గెస్ట్ హౌస్ సీన్ లో సావిత్రి అనుమానం, సావిత్రి అవమానం, సావిత్రి కోపం, సావిత్రి బాధ కేవలం కళ్ళతోనే పలికించింది కీర్తి ! కళ్ళతో నే అన్నీ భావాలు పలికించే సావిత్రి నే తన కళ్ళతో పలికించిన కీర్తి సురేష్ ఈ మహానటి సినిమా తో శాశ్వత కీర్తి పొందుతారు !

కీర్తి సురేష్ తరువాత అంత అద్బుతం గా తీర్చిన పాత్ర జెమినీ గణేశన్ ది.. ఆ పాత్ర లో సల్మాన్ దుల్కర్ చక్కగా ఒదిగిపోయాడు..! ఆ పాత్ర దర్శకుడు ఎంత బాగా తీర్చిదిద్దాడు అంటే జెమినీ సావిత్రి ని పెళ్ళి చేసుకోవాలి అని ప్రేక్షకులే కోరుకునే అంత గా.. ! జెమినీ సావిత్రి మీద ఈర్ష పెంచుకున్నప్పుడు , వేరే అమ్మాయి తో సంబంధం పెట్టుకున్నప్పుడు జెమినీ ని ద్వేషించేంత గా.. (ఈ ద్వేషం ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఉంటాది)



నిజానికి మహానటి సినిమా మనకి సావిత్రి ని మాత్రమే కాదు.. చక్రపాణి , ఎల్.వి. ప్రసాద్, వేదంతం రాఘవయ్య, అక్కినేని వంటి ఎందరినో చూపిస్తాది. అందరూ ఆయా పాత్రల్లో ఒదిగిపోయారు.






సమంత పాత్ర ఎనభై ల కాలం నాటి చదువుకున్న అమ్మాయిని  (నాకెందుకో యద్దనపూడి గుర్తొచ్చారు !) మన ముందు ఉంచుతాది. క్లైమాక్స్ లో సమంత సంభాషణలు భావోద్వేగానికి గురిచేస్తాయి. దేవరకొండ విజయ్ పాత్ర బాగుంది.



సావిత్రి కధ ని సావిత్రి అభిమానించే ఒక ఫోటోగ్రాఫర్ ద్వారా కొంత, సావిత్రి పెద్దమ్మ దుర్గమ్మ ద్వారా కొంత, అలా వేరే వేరే కోణాల్లో నుండి చూపిస్తూ నడపడం చాలా బాగుంది !!

సినిమా కి సంగీతం, ఫోటోగ్రఫీ, కాస్ట్యూమ్స్, ఆర్ట్ ప్రాణం పోసాయి..! మూగమనసులు సాంగ్ అయితే బాహుబలి హంస నావ సాంగ్ స్థాయి లో ఉంది !!

సమాప్తం !